కామారెడ్డి, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ, ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకొని 11 వ వసంతంలోకి అడుగిడుతూ ఉత్సాహ పూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పధంలో పయనించుటలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన శానసభ, లోక సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించుటలో, అధిక సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని స్థాయిల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు పట్టణంలోని హోసింగ్ బోర్డు కాలనిలో గల అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్ సింగ్, అదనపు కలెక్టర్లు చంద్ర మోహన్, శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, వైస్ చైర్ పర్సన్ వనిత, జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.