ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌

నిజామాబాద్‌, జూన్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పార్లమెంట్‌ ఎన్నికలలో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మంగళవారం లెక్కింపు జరిపారు.

రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో జగిత్యాల కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు కౌంటింగ్‌ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్‌ వజ్‌ ఆర్‌, లలిత్‌ కుమార్‌ లు ఓట్ల లెక్కింపు తీరును నిశితంగా పరిశీలించారు.

ముందస్తుగానే టేబుళ్ల వారీగా కౌంటింగ్‌ సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులతో పాటు స్ట్రాంగ్‌ రూంల నుండి వెంటదివెంట ఈవీఎంలను కౌంటింగ్‌ హాళ్లకు తరలించేలా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, వెంటదివెంట ఓట్ల లెక్కింపు జరుపుతూ ఫలితాలు వెల్లడిరచారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికే పోస్టల్‌ బ్యాలెట్లతో పాటు, పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, అన్ని అంశాలను సరిచూసుకున్న మీదట రిటర్నింగ్‌ అధికారులు ఒక్కో రౌండ్‌ వారీగా ఫలితాలను వెల్లడిరచారు.

మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఒక్కో అభ్యర్థి వారీగా పోల్‌ అయిన ఓట్ల వివరాలను ప్రకటించారు. ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలో పూర్తి చేయగా, బోధన్‌ 14 రౌండ్లు, నిజామాబాద్‌ అర్బన్‌ 15 రౌండ్లు, నిజామాబాద్‌ రూరల్‌ 15 రౌండ్లు, బాల్కొండ 14 రౌండ్లు, కోరుట్ల 15 రౌండ్లు, జగిత్యాల 15 రౌండ్లలో కౌంటింగ్‌ జరిపిన మీదట రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్‌ ఎం.పీ ధర్మపురి అరవింద్‌ కు పోస్టల్‌ బ్యాలెట్లను కలుపుకుని మొత్తం 592318 ఓట్ల వచ్చాయని, రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవం రెడ్డికి 483077 ఓట్లు పోల్‌ అయ్యాయని వివరించారు.

దీంతో బీజేపీ అభ్యర్థి అరవింద్‌ 109241 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని కలెక్టర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్‌ కు 102406 ఓట్లు వచ్చాయని తెలిపారు. నోటాకు 4440 పోల్‌ అయ్యాయని, మొత్తం 7780 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 414 ఓట్లు వివిధ కారణాల వల్ల చెల్లుబాటు కాలేదని వివరించారు. నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందిన ధర్మపురి అరవింద్‌ కు పరిశీలకుల సమక్షంలో కలెక్టర్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

కాగా, రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌, ఇతర ఉన్నతాధికారులు కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉండి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు నిశితంగా పర్యవేక్షణ జరిపారు. కౌంటింగ్‌ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, 144 సెక్షన్‌ నిషేధాజ్ఞలు అమలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రం లోనికి ఇతరులెవరిని అనుమతించలేదు.

కౌంటింగ్‌ సిబ్బందితో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందికి ఎంట్రీ పాసులు జారీ చేసినప్పటికీ, వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌంటింగ్‌ విధులకు పంపించారు. సెల్‌ ఫోన్‌ లు, వీడియోలు, కెమెరాలను నిషేధించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కౌంటింగ్‌ ప్రక్రియ సందర్భంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా ఏ.డీ.ఈ తోట రాజశేఖర్‌ నేతృత్వంలో ట్రాన్స్కో సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పూర్తి పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును పూర్తి చేసి పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను విజయవంతంగా ముగించడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైంది.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »