కామారెడ్డి, జూన్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వియజవంతంగా పూర్తి చేశామని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చి 26 న పాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా నేటితో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన తెలిపారు.
అకాల వర్షాల వల్ల కొనుగోళ్లలో కాస్త ఇబ్బందులు పడ్డా మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, కేంద్రాల నిర్వాహకులను మానిటరింగ్ చేసుకుంటూ తహశీల్ధార్, సహాకార శాఖ, ఐకెపి, పౌర సరఫరాల సిబ్బంది, ఇతర అధికారుల సహకారంతో క్రతువు విజయవంతంగా పూర్తి చేశామని చంద్రమోహన్ తెలిపారు.
రైతులు కూడా సంయమనం పాటించి జిల్లా యంత్రాంగానికి ఎంతో సహకరించారని అన్నారు. జిల్లాలో 55,222 మంది రైతుల నుండి 698 కోట్ల 75 లక్షల రూపాయల విలువగా 3,17,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 674 కోట్లు జమచేశామన్నారు. వందశాతం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయ్యిందని, మిగతా రైతులకు రెండు రోజుల్లో జమచేస్తామని ఆయన తెలిపారు.