కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పిడి ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్ చేయాలని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. వరినాట్లు ప్రారంభమైనందున రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా వ్యవసాయాధికారులు అవగాహన కలిగించాలన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ దఫెదార్ శోభ రాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో వ్యవసాయ రంగాన్ని సమీక్షిస్తూ టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని పోచారం సూచించారు.
రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు సరిపడా అందించాలని సూచించగా ఇప్పటి వరకు 4,600 క్వింటాళ్ల జిలుగు, 1343 క్వింటాళ్ల జనుము విత్తనాలను అందజేశామని, అదనపు కేటాయింపుకు ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తుందని ప్రకటించిన విషయాన్ని రైతులకు తెలిపి సన్న ధాన్యం పండిరచేలా వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కలిగించాలన్నారు.
కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పులు పెరిగేలా చూడాలన్నారు. సదరం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ లో సాంకేతిక కారణంగా వికలాంగులు నష్టపోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి సదరం సర్టిఫికెట్లు అందించేలా చూడాలని కోరగారాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఆన్ లైన్ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రెండు పడకల గదుల ఇళ్ల పెండిరగు బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని, కొత్త పధకాల అమలు, పాత పధకాల పేరు మార్పులపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
విద్యా శాఖ ను సమీక్షిస్తూ రెండు, మూడు రోజులలో అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద 947 పాఠశాలలో విద్యుత్, మంచినీరు, టాయిలెట్స్, చిన్న చిన్న మరమ్మత్తు వంటి పనులు గుర్తించి చేపట్టామన్నారు.
గతంలో టాయిలెట్స్ యూనిట్ల నిర్మాణానికి 2 ,3 లక్షల వరకు అంచానాలు ఉండగా నేడు క్రింద ఒక లక్ష రూపాయల లోపే టాయిలెట్స్ యూనిట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా పాఠశాలలను, టాయిలెట్స్ శుభ్రం చేయుటకు ఒక ఉద్యోగి ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, త్వరలో నిర్ణయం వెలువడనుందని,మన ఊరు మన బడి క్రింద 18 కోట్ల పెండిరగ్ బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకుంటున్నామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు.
పౌర సరఫరాల శాఖను సమీక్షిస్తూ ఆరుగాలం కష్టించి పండిరచి అకాలవర్షాల వల్ల ధాన్యం తడిచి బాధపడుతున్న రైతుల నుండి క్వింటాల్ కు 5 కిలోల చొప్పున తరుగు తీయడం బాధాకరమని, వచ్చే సీజనుకైనా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు సభ్యులు సూచించారు. రైతుల నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తున్న చౌక ధరల దుకాణాల ద్వారా దారుణమైన బియ్యం సరఫరా చేస్తున్నారని, వసతి గృహాలు, పాఠశాలలో విద్యార్థులు భోజనం చేయలేని పరిస్థితులలో ఉన్నారని సభ్యులు బాధను వ్యక్తం చేయగా వారంలో ఒక రోజు తహసీల్ధార్లు తప్పక హాస్టల్స్,స్కూల్స్ సందర్శించి భోజనం రుచి చూసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామన్నారు.
భూగర్భ జలాల పెంపునకు ఉపాధి హామీ పధకం క్రింద జిల్లాలో 20 వేల పంపాడ్స్ నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఇజిఎస్ క్రింద 4,285 పనులు చేపట్టి 22 లక్షల 60 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుండి వితంతు పింఛన్లు మంజూరు కావడం లేదని సభ్యులు ప్రశ్నించగా తగు ప్రాసెస్ చేస్తున్నామన్నారు.
పలు ప్రాంతాలలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, వర్షాకాలం ప్రారంభమైనందున ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ శాఖల ద్వారా మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రమాదాలు జరగకుండా చిన్న చిన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని, అవసరమైన దగ్గర బ్రిడ్జిల నిర్మాణం, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు.
నీటిపారుదల శాఖను సమీక్షిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ 22వ ప్యాకేజి పనులు, మంజీరా ఎత్తిపోతల పధకం పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రైతులు తమ పంట పొలాలకు చెరువుల నుండి మట్టి తీసుకెళ్లుటకు అభ్యంతరం చెప్పవద్దని , రెవిన్యూ, మైన్స్ శాఖల సమన్వయంతో పర్యవేక్షించాలని, రైతుల మధ్య అపోహాలు సృష్టించవద్దని కలెక్టర్ ఎస్ ఈ ని ఆదేశించారు.
పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ కార్యక్రమాలను కూడా సమీక్షించారు. ఇదే చివరి జెడ్పి సమావేశమని, గత ఐదేండ్ల నుండి సభలు, సమావేశాలు సజావుగా నిర్వహించి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరింపజేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు చైర్ పర్సన్ శోభ కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో జెడ్పి సీఈఓ చందర్, జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా అధికారులు భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్, విజయలక్ష్మి, రాజు, నిత్యానందం, హనుమంత రావు, రవి శంకర్, రాజేంద్ర కుమార్, జెడ్పిటిసి సభ్యులు, ఎంపిపిలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.