నందిపేట్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. గడిచిన రెండు రోజుల నుండి నందిపేట్ మండలంలో వాన దంచికొట్టింది. 162.8 వర్షపాతం నమోదు అయింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు, మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల మండలంలోని జోర్పూర్ వాగు నిండి రోడ్డుపై నిండి పొర్లుతున్నాయి. బ్రిడ్జికి ముప్పు సంభవించే ప్రమాదం కనిపిస్తున్నది. మండల అధికారులు నది వద్దకు వెళ్లి పరిశీలించారు.
భారీ వర్షాల కారణంగా వెల్మల్ గంగి చెరువు పూర్తిగా నిండి పొర్లడంతో జోర్పూర్ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జోర్పూర్ వాగు దాటకూడదని, ప్రత్యమ్నాయ దారి గుండా వెళ్లాలని తహసీల్దార్ అనీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో చాలా రోజుల తర్వాత ఇలాంటి వర్షం కురిసిందని ప్రజలు అంటున్నారు.
ఖుదన్పూర్ గ్రామ చెరువు పూర్తిగా నిండి నందిపేట్ గ్రామంలోని శపూర్ రోడ్డు వరకు నీరు వచ్చింది. చెరువు నీరు అలుగుల మీది నుండి రోడ్లపై పారుతున్నవి. నీటి ఉధృతికి చేపలు కొట్టుకొని పోతున్నాయి. చెరువులలో ఉండే చేపలు రోడ్లపై తేలాయి. ఇదే అదునుగా ప్రజలు చేపలు పట్టడానికి చెరువుల వద్ద గుమి గూడారు.
వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండ మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ఉమ్మేడ ఉమామహేశ్వర ఆలయం నీటిలో మునిగింది. గోదావరికి దిగువన గల శ్రీరామ్ సాగర్ ప్రజెక్ట్ పూర్తిగా నిండి పోవడంతో గేట్లు తెరిచి దిగువకు వదిలారు.
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.