కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసారి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల పట్ల, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వర్షాకాలం ప్రారంభమైనందున వర్షాలు, వరదల వలన నష్టం కలగకుండా ముందస్తుగా శిథిలమైన, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను గుర్తించి వెంటనే కూల్చి వెయ్యాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి వరదల తాకిడికి నివాస గృహాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల వలన సీజన్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున త్రాగు నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని అన్నారు. మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ ద్వారా శుభ్రపరచాలని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి చెత్త కుప్పలను, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. గ్రామాలలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సీజన్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ చందర్ , డి ఎం అండ్ హెచ్ ఓ చంద్రశేఖర్, డిపిఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.