కామారెడ్డి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవలసినదిగా ఎస్సి,ఎస్టీ, ఓబిసి, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయతీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి అరికడుతూ మంచినీటిని సరఫరా చేయాలన్నారు.
కామారెడ్డి మునిసిపాలిటీల్లో 18,800 గృహ సముదాయాలకు ప్రతిరోజు 18.23 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా మిషన్ భగీరథ, పెద్ద చెరువు, బోర్ వెల్స్ ద్వారా 10.59 మిలియన్ లీటర్ల నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నామన్నారు. తరచూ జిపిఆర్ పైప్ లైన్ లీకేజీలవల్ల నీరు సక్రమంగా రావడం లేదని, భవిష్యత్తు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇందల్వాయి నుండి మల్లన్నగుట్ట వరకు 24.7 కిలో మీటర్ల మేర రూ. 195 కోట్ల తో నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నామని, టెండర్లు పూర్తయ్యాయని నిధుల మంజూరు కోసం మంత్రితో చర్చించి ఆరు మాసాలలో పనులు పూర్తి చేస్తామన్నారు.
అమృత్ 2.0 క్రింద కామారెడ్డి మున్సిపాలిటీలో మంచినీటి సరఫరాకు రూ. 93 కోట్లతో రూపొందించిన కార్యక్రమం అగ్రిమెంట్ కావలసి ఉన్నదని, త్వరలో అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం పెద్ద చెరువుతో పాటు టేక్రియాల్ చెరువు నుండి కామారెడ్డి పట్టణానికి మంచినీటి సరఫరాకు విడివిడిగా ప్రతిపాదనలు రూపొందించవలసినదిగా అధికారులకు సూచించారు.
పనులు పూర్తి కావడానికి సమయం పడుతున్నందున తాత్కాలికంగా నీటి ఎద్దడి నివారణకు బోర్ వెల్స్ రీఛార్జ్ కు చర్యలు తీసుకోవలసిందిగా మునిసిపల్ కమీషనర్ కు సూచించారు. కాగా మునిసిపాలిటీలో రూ. 21 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, అందులో ఫిల్టర్ బెడ్ ల ద్వారా మంచినీటి సరఫరాకు రూ. 17 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారుకు తెలుపగా సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, నీటి పన్ను వసూలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టిఎఫ్ ఐడిసి పధకారం క్రింద కామారెడ్డి మునిసిపాలిటిటీ లో రూ. 24 కోట్లతో పలు పనులు చేపడుతున్నామని షబ్బీర్ అలీ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో సరఫరా చేస్తున్న నీరు పసుపు రంగులో వస్తున్నదని, వాసన వేస్తున్నదని ఫిర్యాదులు వస్తున్నాయని, నాణ్యత గల నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. కాగా గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకాధికారులు గత మే 7 నుండి 15 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లీకేజీలను అరికట్టడంతో పాటు బోర్ వేల్స్, రీ-ఛార్జి, మోటార్ల బిగింపు, నీటి సరఫరా కానీ ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా వంటి వంటి పనులు చేపట్టారని, ప్రస్తుతం నీటి ఎద్దడి లేదని కలెక్టర్ వివరించారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం 22 వ ప్యాకేజి పనుల ప్రగతిని సమీక్షిస్తూ ప్రస్తుత సంవత్సరంలో చేపట్టు పనులు, పెండిరగ్ బిల్లుకు సంబంధించి రూ. 375 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ ఈ ఈ విద్యావతికి సూచించారు.
సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ ఈ రాజేంద్ర కుమార్, ఈ లు స్వప్న, నరేష్ కుమార్, రమేష్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ తిరుపతి కుమార్, డిపిఓ శ్రీనివాస్, మునిసిపల్ కమీషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.