నందిపేట్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఏ కూర వండాలన్న టమాట వేయడం పరిపాటైంది. దీనితో ఎన్నో పోషక విలువలున్న టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. గత నాలుగైదు నెలల కింద కిలో టమాట కేవలం 10 రూపాయలు. కాని ప్రస్తుతం కిలో 60 రూపాయలకు ఎగబాకటం సామాన్యులకు మింగుడు పడటం లేదు. కొందామంటే కొరివిలా మా బ్రతుకులు తయారు అయ్యాయని సామాన్య కుటుంబాలవారు మొత్తుకుంటున్నారు.
ఇంకా కొన్ని రోజులైతే కిలో వంద రూపాయలు అయిన ఆశ్చర్యపోనక్కరలేదని అమ్మకందారులు అంటున్నారు. ఇంత రేట్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో టమాట దిగుబడి సరిగా రాదు. ఈ పంట 37 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మంచి దిగుబడి వస్తుంది. కాని ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పెరగడంతో టమాట మొక్కలు తట్టుకోలేక ఎండిపోయాయి.
అంతే కాకుండ భూగర్భ జలాలు పడిపోవడం, నీడ లేక కాయ పరిమాణం చిన్నది, మచ్చలు రావడంతో రైతులు పంటను పశువులకు మేత గా వదులుకున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే టమాట ధర ఆకాశానంటుతుంది. ఈ సమస్య వస్తాయని చాలా మంది రైతులు పంట వేయడానికి ముందుకు రాకపోవడం కూడ టమాట ధర పెరగడానికి కారణం కావచ్చు. ఇంకా కొన్ని రోజుల వరకు ధర మరింత పెరగవచ్చని అమ్మకందారులు అంటున్నారు.
మరో వారం పది రోజులలో ఆంధ్ర లోని మదనపల్లి మార్కెట్ నుంచి టమాట వస్తే ధర తగ్గవచ్చని వారు అంటున్నారు. ఏది ఏమైనా టమాటకు ప్రజలు అలవాటు పడటం తో ఎంత రేటు అయిన కొనాలసిందే. అందుకే చిల్లర వ్యాపారులు తమ వ్యాపారం మానుకున్నారు.