నిజామాబాద్, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను పురస్కరించుకుని బుధవారం బోధన్ పట్టణం రాకాసిపేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
విద్యా సంవత్సరం పునః ప్రారంభం అయిన మొదటి రోజునే విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. రేపటి పౌరులైన నేటి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ బడులలో అన్ని సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని అన్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు సైతం ప్రైవేటుకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తోడ్పాటును ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందని, కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఇతరాత్ర రంగాలలో స్థిరపడి సమాజానికి సేవలందించడం ద్వారా గుర్తింపు పొందవచ్చని సూచించారు. తల్లిదండ్రుల తరువాత దైవంగా కొలువబడే గురువులు బోధనా వృత్తికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదైతే, చక్కటి ప్రణాళికతో విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని గుర్తు చేశారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాల వంద శాతం ఫలితాల సాధనకై కృషి చేయాలని, ఏ ఒక్క బడిలోనూ ఈ విద్య సంవత్సరంలో పదవ తరగతి వార్షిక ఫలితాల్లో 75 శాతానికి తగ్గకుండా ఉత్తీర్ణత నమోదు చేయాలని ఆకాంక్షించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నాణ్యమైన విద్యా బోధనతో పాటు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. నేడు గొప్ప గొప్ప స్థానాలలో కొనసాగుతున్న అనేక మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని అన్నారు.
జిల్లాలోని 158 ప్రభుత్వ బడులు పది ఫలితాల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని, 103 మంది విద్యార్థిని, విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించారని కలెక్టర్ తెలిపారు. జిల్లా సగటు ఉత్తీర్ణత 93.72 శాతం నమోదయ్యింది వివరించారు. ఇదే స్పూర్తితో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల సాధన దిశగా అంకిత భావంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ సైతం ఉపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలను పెంపొందేలా శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని అన్నారు.
మౌలిక సదుపాయాల మెరుగుదల చర్యలలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని 792 ప్రభుత్వ బడులలో టాయిలెట్స్ నిర్మాణాలు, మంచినీటి వసతి కల్పన వంటి పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ వివరించారు. అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం ఏర్పరిచి, ఆరేళ్ళు దాటినా బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కాగా, ప్రభుత్వ తోడ్పాటుతో జిల్లాలో బడులు పునః ప్రారంభం అయిన మొదటి రోజునే లక్షా 12 వేల మంది విద్యార్థిని, విద్యార్థులకు ఏకరూప దుస్తులతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు అందించడం జరుగుతోందని అన్నారు.
విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ లను కుట్టి ఇచ్చే బాధ్యతలను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.వి.దుర్గాప్రసాద్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణ, ఎం.ఈ.ఓ నాగనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల చంద్రం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.