నిజామాబాద్, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండిరగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వీ.సీ ముగిసిన అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ధరణిలో వివిధ మాడ్యూల్స్ కింద దాఖలైన దరఖాస్తులను తక్షణమే పరిశీలిస్తూ, యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయిన వాటిని మూడు, నాలుగు రోజుల్లో పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండిరగ్ లో లేకుండా వారం వ్యవధిలోపు అన్నింటినీ పరిష్కరించాలని స్పష్టమైన గడువు విధించారు.
బోధన్ తహశీల్ కార్యాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని, సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డీఓ, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీఓ, తహసీల్దార్ లాగిన్లలోని పెండిరగ్ దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ క్లియర్ చేయాలన్నారు. అలసత్వానికి ఏమాత్రం తావు లేకుండా, దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాతో ముడిపడిన అర్జీలను కూడా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీలపై చేపట్టిన చర్యల గురించి దరఖాస్తుదారునికి వివరాలు తెలియజేయడంతో పాటు, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో పొందుపర్చాలని అన్నారు.
అర్జీలపై తక్షణమే స్పందిస్తూ, సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందింపజేయాలని హితవు పలికారు. ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలకు సంబంధించి రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.