కామారెడ్డి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాజంపేట మండలంలో అక్రమ మద్యం, కల్లు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశామని జిల్లా ఆబ్కారీ శాఖాధికారి రవీందర్ రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం జరిగిన రాజంపేట మండల సమావేశంలో అక్రమ మద్యం.. కల్తీ కల్లుపై చర్యలు లేవని వచ్చిన వార్తకు స్పందిస్తూ దోమకొండ ఆబ్కారీ ఇన్స్పెక్టర్ అక్రమ మద్యం, కల్తీకాలు అమ్మకాలపై నిఘా పెట్టి తరచూ దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
జనవరి నుండి ఇప్పటి వరకు 6,72,115 విలువ గల అక్రమ మద్యం, కల్తీకల్లు అమ్మకాలను స్వాధీనం చేసుకొని 18 కేసులు నమోదు చేయడంతో పాటు, ముగ్గురిని అరెస్ట్ చేశారని అన్నారు. కల్తీ కల్లు అని అనుమానాస్పదంగా ఉన్న 5 కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపగా క్లోరల్ హైడ్రేడ్ కానీ డైజోఫామ్ కానీ కలుపలేదని నిర్దారణ అయిందని అన్నారు.
ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్లు జిల్లాలోని లైసెన్స్ కలిగిన అన్ని కల్లు దుకాణాలను తరచూ తనిఖీ చేస్తూ కల్తీకల్లు అమ్మడం నేరమని, శిక్షార్హులని హెచ్చరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా అధికారులు తనిఖీ చేస్తున్నారని రవీందర్ రాజు తెలిపారు.