నిజామాబాద్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 164 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, డీఆర్డీఓ సాయాగౌడ్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అజ్మీరా రాంజీ మృతి పట్ల సంతాపం
నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా రాంజీ అకాల మరణం చెందడం పట్ల టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సంతాపం వ్యక్తం చేసింది.
ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అజ్మీరా రాంజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, టీఎన్జీఓ ల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అజ్మీరా రాంజీ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.