కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు ఖరారు చేయుటకు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా, ప్రస్తుత వానాకాలంపంటలపై శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ ధనం వ్యర్థం కావద్దనే ఉద్దేశ్యంతో రైతు భరోసా కార్యక్రమం మరింత పకడ్బందీగా, సమర్థవంతంగా, జాగ్రత్తగా అమలుచేయుటకు ప్రభుత్వం రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని సబ్ కమిటీతో చర్చించి జులై 15 లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పలు జిల్లాల రైతు వేదికల నుంచి రైతులు 10 ఎకరాల వరకు రైతు భరోసాను అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న అపోహలను నమ్మవద్దని, రైతులకు పూర్తి న్యాయం చేకూరేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని మంత్రి తెలిపారు.
ఎంత విస్తీర్ణం పంటలు పండిస్తే అంత విస్తీర్ణానికి రైతు భరోసా అందించాలని, పరిమితి విధిస్తే అంత లోపే పంటలు వేసే అవకాశముందన్నారు. అదేవిధంగా కౌలుదారులకు, రైతులకు రైతు భరోసాను సగం సగం అందించాలని, నిజంగా వ్యవసాయం చేస్తున్న అందరికి సకాలంలో రైతు భరోసా అందించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ షరతులు లేకుండా రుణమాఫీ వర్తిపచేయాలని, వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామి పనులను అనుసంధానం చేయాలని కోరారు.
ప్రతి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని, పాడిపరిశ్రమను ప్రోత్సహించాలని ఎర్రపహడ్ రైతు దేవిరెడ్డి విఠల్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రైతులతో మాట్లాడుతూ ఆర్గానిక్ పంటలకు మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా పంటలు సాగు చేయాలన్నారు. మార్కెటింగ్ అవకాశాల మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు.
మహిళా రైతులు కూడా ముందుకువచ్చి పంటలు సాగు చేయాలన్నారు. అన్నదాతకు ఆలంబనగా రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా రైతులకు అధిక దిగుబడులు సాధించడంలో మెళకువలు, సలహాలు, సూచనలు, సాంకేతిక ఉపకరణాల వినియోగంపై అవగాహన కలిగిస్తున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, ఎడిఎ వీరాస్వామి, ఏ.ఓ. శ్రీకాంత్, ఏఈవో రాకేష్, తహశీల్ధార్ రహిమోద్దీన్, ఎంపిడిఓ సాజిద్ అలీ, ఎఎంసి డైరెక్టర్ కపిల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.