నిజామాబాద్, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దేవాలయాలే హిందూ ధర్మము మరియు సంస్కృతి యొక్క పరిరక్షణకు శ్రద్ధ కేంద్రాలని కాబట్టి ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది అని ఒకవేళ దేవాలయాలు దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురైతే ప్రతి హిందువు తన ఇల్లు ఆక్రమణకు గురైన విధంగా భావించి రోడ్డుమీదకు రావాలని అప్పుడే మన హిందూ జాతి యొక్క అస్తిత్వము బలంగా ఉంటుందని లేకపోతే రోజుకొకరు ఏదో ఒక రూపంలో దేవుడు ఆస్తులను దేవాలయాలను దోచుకోవడానికి కాచుకొని కూర్చున్నారని అలాంటి వ్యక్తుల పట్ల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వ్యాఖ్యానించారు.
హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో శంభుని గుడిలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్య స్వామీజీ మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ కోసమే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన యాత్ర పేరుతో తాను నిర్వహించిన పాదయాత్ర రథయాత్రలో తెలుసుకున్న విషయాలు ఎంతో ఆవేదన కలిగించాయని స్వామీజీ అన్నారు.
హిందూ సమాజము కొత్తగా దేవాలయాల్ని నిర్మించకపోయినా ఇదివరకే ఉన్న దేవాలయాలను పరిరక్షించుకునేటువంటి బాధ్యతను మాత్రం స్వీకరించకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయని వారు హెచ్చరించారు.
ఇందూరు జిల్లాలో దేవాలయాలకు ఎంతో చరిత్ర ఉన్నదని అంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరము ,తక్షణ కర్తవ్యం హిందూ సమాజం మీద ఉన్నదని దానికోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పని కోసం నడుం బిగించాలని సూచించారు.
సామరస్య భావనతో శంభుని గుడి చుట్టూ అక్రమంగా నెలకొల్పిన దుకాణాలను తొలగించి ఆలయ పవిత్రతను కాపాడే లాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరియు అధికారులకు ఆయన సూచించారు శంభునిగుడితోపాటు జిల్లాలో ఆక్రమణకు గురైన దేవాలయాల ఆస్తులన్నీ తిరిగి అప్పగించాలని ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ఒక శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
సమావేశంలో దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్, జైపాల్, బంటు ప్రవీణ్, ఎండల సుధాకర్, స్వామి యాదవ్, శ్రీనివాస్ శర్మ, సంజయ్ సంగువాయి, కిషన్ వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.