మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హైకోర్టు జడ్జి శ్రీసుధ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ, జిల్లా సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో హైదరాబాద్‌ జోనల్‌ డైరెక్టర్‌ సచిన్‌ గోర్పడే, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ మాట్లాడుతూ, తాము చదువుకునే రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఉండేవి కావని, డ్రగ్స్‌ అనే పదమే వినిపించేది కాదన్నారు. కానీ నేడు అనేకమంది విద్యార్థులు డ్రగ్స్‌ కు అలవాటుపడి మానసిక కుంగుబాటుకు లోనవుతూ బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికత, సమాచార విప్లవంతో విజ్ఞాన పరమైన అనేక అంశాలను తెలుసుకునే వెసులుబాటు ఏర్పడిరదని, అదే సమయంలో యువత, విద్యార్థులు పెడద్రోవ పట్టేందుకు కూడా ఇవి కారణభూతంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో గమ్యం దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. లక్ష్యం వైపు పయనించే క్రమంలో ఎదురయ్యే అపజయాలు, ప్రతీకూల పరిస్థితులను చూసి ఎంతమాత్రం వెనుకంజ వేయకూడదని, జీవితంలో గెలుపోటములు ఒకే నాణానికి రెండు పార్శ్వాలు వంటివని ఉద్బోధించారు. విద్యార్ధి దశ నుండే క్రీడలు, వ్యాయామాలు వంటివి ఆచరిస్తే, గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం అలవడుతుందని అన్నారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ, మన లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని హితబోధ చేశారు.

హైకోర్టు జడ్జి పి.శ్రీసుధ మాట్లాడుతూ, బాధ్యతల భారం తెలియని నేటి తరం పిల్లలు, చిన్నచిన్న కారణాలకే మానసిక సమతుల్యాన్ని కోల్పోతున్నారని, అలాంటి వారు ఎంతో సులభంగా డ్రగ్స్‌ వైపు మొగ్గుచూపుతూ వాటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తమను తాము పరిరక్షించుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్‌ కు అలవాటుపడినట్లు గమనిస్తే, వెంటనే వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని, దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, డ్రగ్స్‌ వినియోగం, వాటిని కలిగి ఉండడం వల్ల ఎదుర్కోవాల్సి వచ్చే శిక్షలు తదితర అంశాల గురించి నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో హైదరాబాద్‌ జోనల్‌ డైరెక్టర్‌ సచిన్‌ గోర్పడే పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సవివరంగా తెలియజేశారు. డ్రగ్స్‌ శారీరక, మానసిక దౌర్బల్యతను కలిగించడమే కాకుండా, సమాజానికి కూడా ఎంతో హానికారకంగా మారాయని అన్నారు.

కాగా, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి జిల్లా జడ్జి సునీత కుంచాల వివరించారు. ఈ సదస్సులో న్యాయాధికారులు, వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, ఆయా శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »