గల్ఫ్‌ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై వెనక్కు తగ్గిన కేంద్రం

నిజామాబాద్‌, జూలై 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ఆరు గల్ఫ్‌ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్‌ రెఫరల్‌ వేజెస్‌) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో మనవారి ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది.

లేబర్‌ మార్కెట్‌ (కార్మిక విపణి) స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తాము అని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ గురువారం రాజ్యసభకు తెలిపారు. కేరళకు చెందిన ఎల్‌.జె.డి ఎంపీ ఎం.వి. శ్రేయాన్స్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.

ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్‌ వేజెస్‌) ను 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జారీ చేసిన సర్కులర్లను రద్దుచేసి, పాత వేతనాలను కొనసాగించాలన్న డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో గల్ఫ్‌ ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.

కోర్టులో వ్యాజ్యం, కార్మికుల ఉద్యమ ఒత్తిడి

కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ గల్ఫ్‌ కార్మికులు, గల్ఫ్‌ జెఏసీ చేసిన ఉద్యమానికి కేంద్రం తల ఒగ్గింది. తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కేంద్రానికి విజ్ఞప్తిచేయడం, ఎంపీ కెఆర్‌ సురేష్‌ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించడం, గల్ఫ్‌ కార్మికనేత మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్‌ వేయడం వెరసి అన్ని రకాల ఒత్తిడులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వేతన తగ్గింపును ఉపసంహరించుకుంది.

మార్చి నెలలో పార్లమెంటు సమావేశాల సందర్బంగా ఢల్లీికి తరలివెళ్లిన గల్ఫ్‌ జెఏసి ప్రతినిధుల బృందం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ను, అన్ని పార్టీల ఎంపీలను కలిసి వినతిపత్రాలు సమర్పించింది. గల్ఫ్‌ జెఏసి బృందంలో గుగ్గిళ్ల రవిగౌడ్‌, స్వదేశ్‌ పరికిపండ్ల, తోట ధర్మేందర్‌, మెంగు అనిల్‌, పంది రంజిత్‌, పొన్నం రాజశేఖర్‌, బద్దం వినయ్‌, దాసరి మల్లిఖార్జున్‌, గన్నారం ప్రశాంత్‌, పట్కూరి బసంత్‌ రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు ఉన్నారు

29న హైకోర్టులో విచారణ

గల్ఫ్‌ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్‌లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి. విజయ్‌ సేన్‌ రెడ్డిల ధర్మాసనం ఈ కేసును ఈనెల 29న విచారించనున్నది.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »