నిజామాబాద్, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలె అవకాశం ఉన్నందున,సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ నీటి నిల్వలను తొలగించి పైపులైను లీకేజీలకు మరమ్మతులు చేయించి శుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ మిగతా అన్ని శాఖలతో సమన్వయం ఏర్పరచాలని, ముఖ్యంగా పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫిషరీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, విద్యాశాఖ డిఆర్డిఏ, మున్సిపల్, పబ్లిక్ రిలేషన్ లాంటి శాఖలతో కోఆర్డినేషన్ కలిగి జిల్లాలో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా, డెంగీ, చికన్ గున్యా లాంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలందరికీ విస్తృతంగా గ్రామస్థాయి నుండి అవగాహన కల్పించాలని సూచించారు.
పాఠశాలలో, కళాశాలల్లో అన్నింటిలో అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా వసతిగృహాలు, గురుకులాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వారానికి రెండుసార్లు సందర్శించి విద్యార్థులందరినీ ఆరోగ్యపరీక్షలు చేసి చికిత్సలు అందించాలని సూచించారు. కీటకజనిత వ్యాధులతో పాటు డయేరియా నివారణకై ధీమాస ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. చిన్నారులు డయేరియాకు గురికాకుండా ఆరు శాఖలతో సమన్వయ పరచుకుని తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్, జింక్ కార్నర్స్ ను ఏర్పాటు చేయాలని, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను, సరిపడా మందులను అందుబాటులో ఉంచుకొని ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా సీజనల్ వ్యాధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పిపిటి స్ట్రాటజీ రక్షించుకోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, చికిత్స చేయడం వంటివి పాటించాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరందు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డీఐఓ డాక్టర్ అశోక్, డి ఆర్ డి ఓ సాయాగౌడ్, డిడబ్ల్యుఓ రసూల్ బి, విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.