కామారెడ్డి, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాలసదనం చిన్నారులతో తమ సంతోషాలను జరుపుకొని వారికి ఆనందాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో గల బాలసదనమును ఆకస్మికంగా సందర్శించి బాలసదనంలోని అన్ని గదులను, బాలసదనం ఆవరణను పరిశీలించారు, బాలికలతో మాట్లాడి వారికి కల్పించిన వసతులు ఇస్తున్న ఆహారం, చదువుకోవడానికి కల్పించిన అవకాశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా వర్షాకాలంలో అపరిశుభ్రత వాతావరణంతో వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున పరిసరాలను ఎప్పుడు శుభ్రం చేస్తూ బాలసదనం మొత్తం క్లీన్ గా ఉంచాలని అన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అన్ని ఫ్యానులు పనిచేసేలా రిపేర్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల మరియు ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి చాలా రోజుల నుండి విధులకు హాజరుకాని అవుట్సోర్సింగ్ అటెండర్ హేమలతను విధుల నుంచి తొలగించాలని, నిరంతరం సీసీ కెమెరా పనిచేయాలని, బాలసదనం సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని, నైట్ వాచ్మెన్ కచ్చితంగా సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బాలసదనంలోనే ఉండాలని, నిర్దేశించిన మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ మరియు రాత్రి భోజనం ఫ్రెష్‌గా అందించాలని బాలసదనం సూపరింటెండెంట్ సంగమేశ్వరి ని ఆదేశించారు.
రీడిరగ్ రూమ్‌ను పరిశీలించి చిన్నారులు చదువుకునేందుకు దీన్ని కచ్చితంగా ఉపయోగించాలని అన్నారు. కుట్టు శిక్షణ నేర్పేందుకు ప్రత్యేక సిబ్బంది ఉన్నందున బాలికలకు కుట్టు శిక్షణ ఇప్పించాలని, చదువుతోపాటు పిల్లలకు ఆటలు ఆడిరచాలని, అప్పుడప్పుడు పార్కులకు లేదా ఇతర విహారయాత్రలకు తీసుకెళ్లాలని అన్నారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కు వచ్చే అన్ని కాల్స్ కు రెస్పాండ్ కావాలని అన్నారు. బాలసదనపు చిన్నారులతో బర్త్డే లు మరియు ఇతర పండగలను జరుపుకోవాలనుకునే దాతలు డిసిపిఓ నెంబర్ 9492475105 ను సంప్రదించాలని అన్నారు.
కలెక్టర్ వెంట కామారెడ్డి ఆర్డిఓ రంగనాథ చారి, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, సిడబ్ల్యుసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, డిసిపిఓ స్రవంతి తదితరులు ఉన్నారు.