నందిపేట్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో సొత్తు ఎత్తుకుపోయారు. వెల్మల్ గ్రామానికి చెందిన డాక్టర్ శేఖర్, భర్లపాటి ప్రవీణ్, కుండ సాగర్ కుటుంబాలు ఇంటికి తాళంవేసి ఊరికెళ్ళారు. ఇదే మంచి అవకాశమనుకొని దొంగలు మంగళవారం రాత్రి భారీగా సొత్తు దోచుకెళ్లారని బాధితులు చెప్పారు.
సుమారు 11 లక్షలు నగదు, 20 తులాల బంగారం, 18 తులాల వెండి ఎత్తుకుపోయారు. డాక్టర్ శేఖర్, డబ్బులు ఇంట్లో దాచి ఊరికి పోయాడు. అలాగే ప్రవీణ్ ఇంట్లో బీరువాలో దాచిన కొంత నగదు, బంగారం, వెండి నగలు దొంగలు దోచుకున్నారు. ఆనవాళ్లు తెలియకుండా కారం పొడి చల్లి పారిపోయారు. దొంగలు ముసుగులు ధరించినట్లు సి. సి కెమెరాలో రికార్డు అయింది.
విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన వెల్మల్ చేరుకొని విచారణ జరుపుతున్నారు. బాధిత కుటుంబాలవారు నందిపేట్ పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు నందిపేట్ ఎస్. ఐ రాహుల్ ఆద్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.