కామారెడ్డి, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను మరువద్దని, బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని దానిని సాధించి తీరుతానని ప్రజల్లో బలంగా స్వరాష్ట్ర ఆకాంక్షను నాటిన వ్యక్తి అని, ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అని లాల్ బాల్ పాల్ లలో ఒకరిగా ఉంటూ భారత స్వతంత్ర పోరాట దిశను మార్చిన గొప్ప వ్యక్తి అన్నారు. తిలక్ మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించాడని, ప్రతి ఒక్కరు మహనీయులను స్మరించుకోవాలన్నారు.
మండల అధ్యక్షులు కొమ్మరాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ ప్రముఖ స్వాతంత్ర ఉద్యమకారుడు అని, తన పేరులోనే స్వాతంత్రాన్ని చేర్చుకొని బ్రిటిష్ వాళ్ల చేతిలో చావడం కంటే ఆత్మహత్య మేలు అని దేశం కోసం ప్రాణాలు వదిలిన గొప్ప దేశభక్తుడన్నారు. ప్రతి ఒక్కరు వారి బాటలో నడవాలని అన్నారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు స్వామి, నాగరాజు, డి. రామకృష్ణ, గంగారెడ్డి, గోల్కొండ యాదమ్మ, రజిత తదితరులు పాల్గొన్నారు.