సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల నిర్వహణ తీరుతెన్నులపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని, గడిచిన మూడు సంవత్సరాల నుండి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత గురించి ఒక్కో హాస్టల్‌ వారీగా వివరాలు ఆరా తీశారు. ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు తదితరులు హాస్టళ్లను తనిఖీ చేసిన సందర్భంగా గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ, వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత సంక్షేమ అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలన్నారు.

కేవలం సగటు ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోకుండా, ప్రతి విద్యార్ధి మెరిట్‌ సాధించేలా చొరవ చూపాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండే చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉండే బ్రాండెడ్‌ వస్తువులనే వినియోగించాలన్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా తాగునీరు, ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్‌ లు అందుబాటులో ఉండాలని, టాయిలెట్స్‌, వాష్‌ ఏరియా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎక్కడైనా మౌలిక సదుపాయాల కొరత నెలకొని ఉంటే, ప్రభుత్వ పరంగా సౌకర్యాల కల్పనకు తాము చొరవ చూపుతామని, విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందేలా సంక్షేమ అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రైవేట్‌ బడులతో పోలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు ఎక్కువ ప్రతిభ కలిగి ఉంటారని, తదనుగుణంగా విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలలో పిల్లలకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యా బోధన, సరైన వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. తనతో పాటు జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఎక్కడైనా నిర్వహణపరంగా లోపాలు వెల్లడైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది సైతం తలెత్తకుండా సమర్ధవంతంగా వసతి గృహాలను నిర్వహించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన సరుకులు, కూరగాయలను వినియోగించాలని హితవు పలికారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.

జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యాధికారిని సంప్రదించి చికిత్స చేయించాలని, పై అధికారులకు సమాచారం తెలియజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి హాస్టల్‌ లో ఎల్లవేళలా అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరపాలని, రాత్రి వేళల్లోనూ తప్పనిసరిగా హాస్టల్‌ లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళు, కళాశాలల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా ఎక్కడైనా లోటుపాట్లు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర సహకార సంస్థల ఫెడరేషన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, సంక్షేమ శాఖల అధికారులు, ఆర్‌.సీ.ఓలు, రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »