నిజామాబాద్, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలుసు, కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరుగుతున్నాయని అందరికి తెలుసు. కాని సామాన్యుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతుందంటే ఎవరు నమ్మరు. కాని ఇది వాస్తవం, గత వారం రోజులలో కిలో ఉల్లి 60-70 రూపాయలకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కిలో 30 రూపాయలు ఉన్న ఉల్లి ఒకేసారి 60 రూపాయలకు చేరడం సామాన్యుల కుటుంబాలకు భారంగా మారింది.
ఈ రోజులలో వంటకాలలో ఉల్లి తప్పని సరిగా మారింది. ఉల్లి కొనుగోళ్లు పెరగడం, సాగు తగ్గడం, వేరే రాష్టాల నుంచి సరఫరా తగ్గడం వల్ల రేట్ పెరిగినట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల నుంచి ఉల్లిగడ్డ మన రాష్టానికి సరఫరా అవుతుంది. గత రబీ సీజన్ లో ఎండల వల్ల సాగు తగ్గింది. ఎండ వేడిమి వల్ల ఉల్లి గడ్డ మురిగిపోవడం, మార్కెట్లో రేట్ లేకపోవడంతో ఈ ఖరీఫ్‌లో రైతులు సాగు తగ్గించారు.
దీనికి తోడు వర్షాలు అధికంగా పడటంతో పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రేట్లు అమాంతంగా పెరిగినట్లు, మార్కెట్‌కు సరుకు రావడం లేదని కూరగాయల అమ్మకం దారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో నాటిన పంట ఇంకా చేతికి రాలేదని, అక్టోబర్ నెల వరకు మార్కెట్‌కు కొత్త ఉల్లిగడ్డలు రావచ్చని మార్కెట్ వర్గాల వారు చెబుతున్నారు. అందుకే ఉల్లి ధరలు పెరిగాయి.