నిజామాబాద్, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మానవ జీవితాన్ని సార్థకం చేసుకొని తద్వారా భగవంతుడి హృదయంలో స్థానాన్ని సంపాదించటానికి అత్యంత సులభమైన మార్గమే భజన అని ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ రాజుల్ వార్ దిగంబర్ అన్నారు.
భారతమాత భజన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటేశ్వర్ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భగవంతుడు మానవ రూపంలో జన్మించి చిన్నపిల్లడై నడయాడిన దేశము భారతదేశం అని అంతటి మహోన్నతమైన ఈ దేశంలో భారతీయ సంస్కృతికి ఆధారంగా దేవాలయాలు వెలసిల్లుతున్నాయని అందుకే దేవాలయాల ఆధారంగా సంస్కృతి వారసత్వం ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ప్రతి దేవాలయంలో భజన మండలి ,భజన మండలి ఆధారంగా కుటుంబాలలో సంస్కారము తద్వారా సంఘటిత హిందూ సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్న భారతమాత భజన్ పరివార్ యొక్క సభ్యుల కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
భజన పాడటానికి చదువుతో సంబంధం లేదని మన నిత్యజీవితంలో పనుల్లో నిమగ్నమై భగవంతుడి నామస్మరణ చేయటమే భజన అని అయితే ఆ భజన వ్యక్తిగతంగా ఒకరమే కాకుండా పదిమంది కలిసి ఒక దేవాలయం ఆధారంగా లేదా ఒక ఇంటి ఆధారంగా చేయగలిగితే మనుషుల మధ్యన సత్సంబంధాలు ఏర్పడతాయని తద్వారా మనందరి కుటుంబాలలో మంచి అలవాట్లు మరియు భక్తి సంస్కారము మన పిల్లలకు అందుతాయని అందుకోసమే దేవాలయానికి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళమని మన పెద్దలు చెబుతారని పిల్లల్లో కూడా చిన్ననాటి నుంచే సంస్కారాలను నూరి పోయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
హిందుత్వము సనాతనమైనదని అలాగే నిత్య నూతనమైనదని ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా పాటలలో పాడే తీరులో మార్పు వస్తున్నప్పటికీ ఏ రకంగా కొలిచిన, ఏ రకంగా పిలిచిన పలికే భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఆయన సూచించారు.
భారతమాత భజన్ పరివార్ నగరం మొత్తంలో 60 భజన మండలి నడపటం సాధారణమైన విషయం కాదని త్వరలోనే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు వస్తున్న శుభ సమయంలో భారతమాత భజన్ పరివార్ కూడా 100 భజన మండలుల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని, నగరంలో ఏ ఒక్క దేవాలయంలో కూడా భజన మండలి లేకుండా ఉండకూడదని ఆయన కోరారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు మాట్లాడుతూ హిందూ పరిరక్షణ కోసం భజన మండలి యొక్క కృషి ప్రశంసనీయమైందని ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగుతున్న భజన కేంద్రాలను అపార్ట్మెంట్లకు కూడా విస్తరించాలని ప్రతి అపార్ట్మెంట్లో వారానికి ఒకసారి అయినా భజన జరిగే విధంగా భజన బృందాలను ఏర్పాటు చేయాలని అందుకు తమ యొక్క సహకారం కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
భజన పోటీలకు న్యాయ నిర్ణయితలుగా ఈమని సాయి ప్రసాద్,గంగా ప్రసాద్ వ్యవహరించారు.
కార్యక్రమంలో భారత్ మాతా భజన మండలి వ్యవస్థాపకులు వైట్ల సుబ్బారావు, సహ సంయోజిక మేఘ సుబేదార్, పోతు గణేష్,పోల్కం గంగా కిషన్, సుదర్శన్, 30 భజన మండల్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.