నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరవనిత అని కొనియాడారు. మహిళ పోరాట శక్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ, దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన యోధురాలని గుర్తు చేశారు. ఐలమ్మ చూపిన తెగువ, శౌర్యం, ధైర్యం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించిందని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం పుణికిపుచ్చుకోవాలనే భావనతో ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా, పేదల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో రజక.సంఘం జిల్లా అధ్యక్షుడు గూపన్పల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి ఫతేపూర్ నరేష్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు నల్లగంటి శ్రీలత, రాష్ట్ర కార్యదర్శి చెప్యాల బిక్షపతి, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు, బీ.సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.రమేష్, మరియు సహాయ అభివృద్ధి అధికారులు పి.నర్సయ్య, సి.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.