నిజామాబాద్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం సావేల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో గల వారిని బోట్ ద్వారా ఎన్డిఆర్ఎఫ్ బృందం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన అక్కడికి చేరుకొని ఆశ్రమంలో ఉన్న వారిని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో ఆశ్రమంలో ఉన్న వారికి ప్రమాదం పొంచి ఉన్నందున వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారని ఇందులో భాగంగా మెండోరా – ఏర్గట్ల మండలాల మధ్యన ఉన్నందున రెండు మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఆర్మూర్ ఆర్డివో ఇతర అధికారులు ఆశ్రమంలో గల ఏడుగురిని తరలించడానికి బోటును ఏర్పాటు చేశారని తెలిపారు.
ఏడుగురిని ఒడ్డుకు చేర్చడంతో వారు చుట్టుపక్కల గల వారి గ్రామాలకు వెళ్లారని తెలిపారు. వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినందుకుగాను ఎన్డిఆర్ఎఫ్ టీం లీడర్ దామోదర్ సింగ్‌ను, అతని సభ్యులను అభినందిస్తున్నట్లు, అదేవిధంగా రెండు మండలాల తహసిల్దార్లు జనార్ధన్, సురేష్, ఆర్మూర్ ఆర్డిఓ శ్రీనివాస్‌ను కూడా తగు చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.