నిజామాబాద్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ కె.సురేందర్ ను అడిగి తెలుసుకున్నారు.
స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్ధ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు పరిశీలించారు.
అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు పరిశీలన జరిపారు. స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ ఉన్నారు.