ఆర్మూర్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్షత్రియ పాఠశాల, చేపూర్ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ నిర్వహించారు. వేదికపైన స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న పాండే ఉన్నారు.
గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారని, గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించేనట్లని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశమైతే అధిక సంఖ్యలో పశు సంపదను కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని విధాల సుభిక్షంగా ఉంటుందని అన్నారు.
గోమాతను శుభకార్యలకు ఆహ్వానించి పూజించే సంస్కారం భారతీయులకు ఉన్నదని అన్నారు. ఈ తరం విద్యార్థులకు గోమాత విశిష్టత తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తదనంతరం 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గోమాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ పరీక్ష నిర్వహించారు. జోరు వాన నుండి పశువులను కాపాడడానికి కృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని తన చిటికేన వ్రేలితో లేపిన సంఘటనను అలాగే పాండవుల ఆజ్ఞాత వాసంలో నకుల సహదేవులు గోపాలకులుగా వ్యవహరించిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.