ఎల్లారెడ్డి, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టును నిర్మించి వచ్చే సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రాజెక్టు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు.
శుక్రవారం పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతున్న సందర్బంగా ఆయకట్టు కింద ఖరీఫ్ పంటల సాగు కోసం పోచారం ప్రధాన కాలువ వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులను తీసుకువచ్చి, పర్యాటకంగా, ప్రాజెక్టు నిర్వహణపరంగా అభివృద్ధి చేసి, భవిష్యత్తులో ప్రాజెక్టును ఆదర్శ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ప్రాజెక్టు మొట్ట మొదటిసారిగా జూలై నెలలోనే నిండడం ఎంతో హర్షించదగ్గ విషయమని, ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. కాలేశ్వరం 22 ప్యాకేజి ద్వారా సంవత్సరంలో 365 రోజులు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉంటాయన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద ఖరీఫ్ రబీలలో పంటలు పుష్కలంగా సాగవుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పోచారం గ్రామ సర్పంచ్ విజిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సునీత దుర్గారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డిఓ శ్రీను, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా విట్టల్, సొసైటీ చైర్మన్లు నర్సింలు సెట్, గంగా రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, జిల్లా నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎస్.ఈ నాగేందర్, ఈ.ఈ మల్లేష్, డీ.ఈ వెంకటేశ్వర్లు, తహశీల్దారు సయీద్ అహ్మద్ మస్రూర్, ఎంపిడిఓ రఘు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరహరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట్, గాంధారి మండలాల నాయకులు పాల్గొన్నారు.