కామారెడ్డి, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రతీ రోజు కళాశాలకు హాజరై విద్యాబుద్దులు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు కళాశాలకు రావాలని, అటెండెన్స్ ప్రతీ రోజూ ఉండాలని, లెక్షరర్స్ చెప్పిన పాఠాల్ని ఏ రోజు కారొజు అర్థం చేసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే కళాశాల ప్రిన్సిపాల్ కు తెలియజేయాలని అన్నారు.
తమ పిల్లలు రోజు కళాశాలకు వెళ్తున్నారా లేదా తెలుసుకోవాలని, విద్యార్థులు హాజరైనది లేనిది పెరెంట్స్‌కు తెలపాలని, అందుకు ప్రతీ విద్యార్థి పెరెంట్స్ సెల్ ఫోన్ కళాశాలలో నమోదు చేయాలని, ఏ విద్యార్థి అయితే కళాశాలకు అబ్సెంట్ అయితే అట్టి విషయాన్ని సంబంధిత పెరెంట్స్ కు తెలపాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఆర్టీసి బస్సులు కళాశాల వద్ద ఆపడానికి, వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం సమయానుకూలంగా బస్సులను నడిపే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు.
కళాశాలల్లో మంచినీటి సమస్యను పరిశీలిస్తామని తెలిపారు. అంతకు ముందు కళాశాల ప్రిన్సిపాల్ జి. శంకర్ మాట్లాడుతూ, కళాశాలలో 299 మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రతీ రోజూ 100 నుండి 150 మంది పిల్లలు మాత్రమే హాజరవుతున్నారని, లెక్చరర్స్ చెప్పే లెసన్స్‌కు తప్పని సరిగా హాజరు అయి, ఉత్తీర్ణత శాతం పెంచాలని అన్నారు. ప్రతీ నెల పెరెంట్స్ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.
పిల్లలు రెగ్యులర్ గా కళాశాలకు వచ్చినప్పటికీ మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్తున్నారని, టిఫిన్ డబ్బా తెచ్చుకోలేదు అని విద్యార్థులు చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఇకముందు పిల్లలకు సమయానికి భోజనం ఏర్పాటు చేసి ప్రతీ రోజు కళాశాలకు హాజరయ్యేవిధంగా పెరెంట్స్ సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సలాం, తహసీల్దార్ సంజయ్ రావు, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జ్యోతి, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.