నిజామాబాద్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర, బాలికల ఐ.టీ.ఐ ప్రాంగణాలలో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇప్పటివరకు చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయని అధికారులను ప్రశ్నించారు. మరో మూడు మాసాలలో ఏ.టీ.సీ కేంద్రాల భవన సముదాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలివిడతగా మంజూరీ లభించిన నిజామాబాద్, బోధన్, కమ్మర్పల్లి ఐ.టీ.సీలలో ప్రవేశాలు చేపట్టినందున వీటి భవన నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
వచ్చే వారం సంబంధిత శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సైతం నిర్మాణ పనుల పరిశీలనకు విచ్చేసే అవకాశాలు ఉన్నందున నాణ్యతతో యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. వీటి నిర్మాణాల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తేవాలని అన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.