కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆదివారం కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొన జిల్లా ఇంచార్జి ఎక్స్చేంజ్, పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని, ఎన్నికలలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 10 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించడం జరుగుతుందని, రాబోవు రోజులలో జిల్లాలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు కూడా అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, రెండు లక్షల పైన రుణమున్న వారికి కూడా రుణమాఫీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.