హైదరాబాద్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆచార్య. టి. యాదగిరిరావు మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని అందుకే అత్యంత పారదర్శకంగా విద్యా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్యులను మాత్రమే యూనివర్సిటీలకు ఉపకులపతులుగా నియామకం చేపట్టామని అన్నారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వీ సీ ఆచార్య యాదగిరిరావుని ఉద్దేశించి విద్యారంగంలో అత్యంత అనుభవం ఉన్న మీరు తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో మోడల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడం కొరకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యారంగ అభివృద్ధికి పాటుపడాలని విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల ఏర్పాటుకు సరిjైున ప్రణాళికలతో వస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పి.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.