కామారెడ్డి, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక దృక్పథంతో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం సదాశివనగర్ మండలం భూంపల్లి అంబరీషుని గుట్టపై పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీరుపోశారు.
రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ పార్టీలకతీతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ఆరేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.
అంతరించిపోతున్న అడవులను తిరిగి పునరుద్ధరణ చేయాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో 15 లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. భావితరాలకు స్వఛ్ఛమైన గాలి, నీరు, ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు.
భూంపల్లి గుట్ట గతంలో బోడ గుట్టగా ఉండేదని, ఇప్పుడు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం వల్ల అడవిలా మారిందని పేర్కొన్నారు. మొక్కలు విరివిగా నాటడం వల్ల వాతావరణ పరిరక్షణ జరుగుతోందని చెప్పారు. భావితరాలకు పరిశుభ్రమైన ప్రాణవాయువు లభిస్తోందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎల్లారెడ్డి శాసనసభ్యులు నల్లమడుగు సురేందర్, జిల్లా అటవీ అధికారి నిఖిత, సర్పంచ్ లలితా బాయ్, ఎంపీపీ అనసూయ, జడ్పిటిసి సభ్యుడు నరసింహులు, ఎంపీడీవో రాజ్‌వీర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.