బాన్సువాడ, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని తాడుకోల్ చౌరస్తాలో మొక్కలు నాటారు. పట్టణంలోని పలు వార్డుల్లో మొక్కలు నాటారు. అనంతరం కలికి చెరువు వద్ద సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామసీమలు పచ్చదనం పరిశుభ్రతతో అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
భవిష్యత్తు తరాలకు పర్యావరణ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఆర్‌డివో రాజాగౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.