కామారెడ్డి, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు వారి సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను పరిశీలించి వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని, తన పరిధిలో లేని సమస్యలపై ఉన్నతాధికారులకు విన్నవించాలని సూచించారు.
సోమవారం వివిధ శాఖలకు చెందిన (67) అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఇంటింటి సర్వే ఈ నెల 6 నుండి ప్రారంభించడం జరుగుతుందని, ఎన్యుమరేటర్లకు పవార్ పాయింట్ ద్వారా మండల స్థాయిల్లో శిక్షణ నిర్వహించాలని అన్నారు. 10 శాతం మందిని అదనంగా ఎన్యుమరేటర్లను నియమించుకోవాలని తెలిపారు.
సర్వే చేసేందుకు కావలసిన స్టేషనరీ సామాగ్రి సమకూర్చాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ప్రతీ మండలంలో మాడల్ ఇళ్లు నిర్మించాలని తెలిపారు. వరి ధాన్యం సేకరణలో భాగంగా మండల, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటుచేయాలని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్‌లు ధాన్యం కొనుగులు కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు.
ధాన్యం తేమ శాతం, తూకం, ధాన్యం రవాణా తదితర అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలకు సంబంధిత అధికారులు రిజాయిన్డర్స్ సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.