కామారెడ్డి, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఏ ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు.
హౌస్ లిస్టింగ్ చేసి ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ చేశారా, లేదా అనేవి మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని తెలిపారు. ప్రతీ వి. ఐ. పి. ఇళ్లు లిస్టింగ్ చేశారా, లేదా అనేది కూడా పరిశీలించాలని అన్నారు. ఎన్యుమరేషన్ బ్లాక్ గ్రామ పంచాయతీల వారీగా నిర్వహించాలని తెలిపారు. పెండిరగ్ లో ఉన్న హౌస్ లిస్టింగ్ పనిని త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
ఇంటింటి సమగ్ర సర్వే పనులను కూడా చేపట్టి ప్రతీ అంశం వారీగా, ప్రతీ వ్యక్తి యొక్క సమాచారాన్ని బుక్ లెట్ ప్రకారం సేకరించాలని తెలిపారు. మండలాల వారీగా హౌస్ లిస్టింగ్ వివరాలను సేకరించి సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ లు రంగనాథ్ రావు, ప్రభాకర్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.