నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని వెల్లడిరచారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్, నవీపేట మండలం అభంగపట్నం గ్రామాలలో సహకార సంఘాలు, ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.
ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరణ జరిగింది, ఎన్ని టాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయి, గన్నీ బస్తాలు, లారీల కొరత ఏమైనా ఉందా అని కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నించగా, ఎలాంటి సమస్యలు లేవని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, ప్రతి రోజు ఒక్కో కేంద్రం నుండి కనీసం నాలుగు నుండి ఐదు లారీల లోడ్ ల చొప్పున ధాన్యం నిల్వలు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు.
రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట లారీలలో లోడ్ చేయించి రైస్ మిల్లులకు పంపించాలన్నారు. అకాల వర్షాలు వంటివి లేకుండా వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నందున ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణకు సంబంధించి గన్నీ బ్యాగులు, లారీల కొరత వంటి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో సన్నరకం, దొడ్డురకం వరి ధాన్యం సేకరణకై వేర్వేరుగా మొత్తం 670 వరకు కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కలిపిస్తూ, పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు.
ప్రతి రోజు సగటున 15 వేల నుండి 18 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరణ జరుగుతోంది, ఈ నెల 7 వ తేదీ నాటికే 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వివరించారు. నిబంధనలకు అనుగుణంగా 48 గంటల్లోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట ఓపీఎంఎస్ లో డాటా ఎంట్రీ చేయిస్తున్నామని తెలిపారు. రైతులకు సన్న ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2320 ముందుగా చెల్లించడం జరుగుతుందని, అనంతరం రూ. 500 బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
కలెక్టర్ వెంట డీఆర్డీఓ పీ.డీ సాయాగౌడ్, డీసీఓ ఎన్.శ్రీనివాస్ రావు, డీఎస్‌ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం రాజేశ్వర్, స్థానిక అధికారులు, సొసైటీల చైర్మన్ లు, తదితరులు ఉన్నారు.