నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు ప్రతి విద్యార్థి తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయోగశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి విద్యార్థి ప్రాక్టికల్ తరగతులలో పాల్గొనేలా చూడాలని అన్నారు. వార్షిక పరీక్షల నిమిత్తం డిసెంబర్‌లోగా సిలబస్ పూర్తి చేయడంతో పాటు ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు.
నిష్ణాతులైన అధ్యాపకులచే ఎంసెట్, ఎప్సెట్ సిలబస్ కూడా విద్యాబోధన చేయించాలని ఆదేశించారు. అలాగే వృత్తి విద్యా కోర్సులైన ఒకేషనల్ నిర్వహిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు ఆయా వృత్తి విద్యా కోర్సుల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను (ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను) తరచుగా సందర్శించి విద్యార్థులు శిక్షణను పొందడంతో పాటు, సక్రమంగా శిక్షణ ఉపయోగించుకునేలా విద్య బోధన జరగాలని సూచించారు.
ప్రతి విద్యార్థి డైరీ నిర్వహణ, నపుణ్య శిక్షణ పొందిన అంశాలను క్రోడికరించడం తో పాటు ఫైల్ లను తయారు చేయించాలని ఆదేశించారు. అలాగే ప్రతి జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించడంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు వారిని పరీక్షలకు సంసిద్ధం చేసేలా అధ్యాపకులచే కృషి చేయించాలని ప్రిన్సిపాల్‌లను జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు.