బోధన్, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణకై ఏర్పాటు చేసిన 52 పరిశోధన సంస్థలు, 41ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు ప్రభుత్వ రంగ సంస్థలను మూకుమ్మడిగా ధ్వంసం చేయుటకు కుట్ర చేయటాన్ని నిరసిస్తూ ఆదివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని అంబేడ్కర్, గాంధీ విగ్రహాల ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ 220 సంవత్సరాల క్రితం భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు యుద్ద అవసరాలకు కావాల్సిన పరికరాలు తయారు చేయుటకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్థాపించారని, స్వాతంత్య్ర పోరాటం అనంతరం నాటి పాలకులు దేశ రక్షణ రంగం ప్రభుత్వ సంస్థగా వుండాలనే విదానాన్ని ప్రకటించి, దేశ వ్యాప్తంగా పరిశోధన సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను స్థాపించారన్నారు.
ప్రస్తుతం దేశంలో 52 పరిశోధన సంస్థలు, 41ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 80 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని ద్వంసం చేయటానికి కుట్రలు చేస్తున్నదని తీవ్రంగా మండి పడ్డారు.
అత్యవసర డిఫెన్స్ సర్వీసుల ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు కే. రవి, అశోక్, గంగారాం, పొశెట్టి, సాయులు, ఎస్.గంగాధర్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.