నిజామాబాద్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతుల విశ్లేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో మొత్తం 469988 నివాస గృహాలకు గాను శనివారం సాయంత్రం నాటికి 295436 ఇళ్లలో వివరాల సేకరణ జరిగిందని, 62.86 శాతం సర్వే పూర్తయ్యిందని వివరించారు.
జిల్లాలోని నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 3453 ఎన్యూమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేసి, ఒక్కో బ్లాక్ పరిధిలోని ప్రతి ఇంటిని ఎన్యూమరేటర్లు సందర్శిస్తూ పక్కాగా సర్వే నిర్వహించేలా నిశిత పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. 358 మంది సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సర్వే తీరును పరిశీలిస్తూ, ఎన్యూమరేటర్లకు అవసరమైన సహకారం అందిస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు కూడా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారని వివరించారు.
నిర్ణీత గడువులోపు జిల్లాలో ఇంటింటి సర్వే ప్రక్రియను సమగ్ర వివరాల సేకరణతో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలు సహకరిస్తూ, ఎన్యూమరేటర్లకు నిర్దేశిత వివరాలను అందించాలని కోరారు.