నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్‌పై ఖాన్ బ్రదర్స్ భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ హల్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్ ప్రాతంలో ఉన్న న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్ కార్యాలయ స్థలాన్ని అమ్మివేయాలని లేదంటే చంపివేస్తామని బెదిరించి, ఆదివారం ఖాసీమ్ కార్యాలయంలో ఉన్న సమయంలో అర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాయిద్ ఖాన్ దాడి చేసి తీవ్రంగా గాయపరచడం వారి గుండాగిరి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.
ఖాన్లపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాసీమ్ కార్యాలయం స్థలాన్ని అమ్మాలని దుర్మార్గపు చర్యకు దిగడం సహించారానిదని ఆయన అన్నారు. నేరపూరిత కుట్రచేసి, ఒక ప్రణాళిక ప్రకారం హింసించడం ఖాన్ బ్రదర్స్ క్రూరత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలో ఖాన్ సోదరుల మాఫియా రౌడీయిజం అకృత్యాలు అరాచకాలు పెరిగిపోయారని వాటిని తక్షణమే అరికట్టాలని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని నగరంలో శాంతిభద్రతలు కాపాడాలని రాష్ట్రంలో న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టం తయారు చేస్తున్నదని తెలిపారు. భూమిని అమ్మడం, అమ్మకపోవడం భూయాజమని ఇష్టమని, అమ్మలేదని భౌతిక దాడులు చేయడం అన్యాయమని అన్నారు.
ఖాన్ బ్రదర్స్ క్రూరత్వంపై సమగ్ర నేరవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, తుల గంగాధర్, పరుచూరి శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ ఖాసీమ్కు అండగా న్యాయవాద సమాజం నిలబడుతుందని తెలిపారు. ఖాసీమ్ తమ్ముడు, న్యాయవాది మహమ్మద్ షాదుల్లా, ఖాసీమ్ కుమారుడు, న్యాయవాది మహమ్మద్ ఖాలీద్,ఖాన్ బ్రదర్స్ హింసించిన తీరును వివరించారు.
ఎ.సి.పికి వినతిపత్రం…
సమావేశం అనంతరం వందల సంఖ్యలో న్యాయవాదులు జిల్లాకోర్టు ఆవరణ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిలక్ గార్డెన్, గాంధీ చౌక్, అహ్మది బజార్ మీదుగా ఖిల్లా రహదారి పక్కన గల న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్ కార్యాలయం చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. తిరిగి ర్యాలీగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా నుండి ప్రగతి ఆసుపత్రికి చేరుకుని వైద్య చికిత్స పొందుతున్న ఖాసీమ్‌ను పరామర్శించారు.
అక్కడి నుండి నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. దాడికి పాల్పడిన ఖాన్ బ్రదర్స్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, నేర విచారణను త్వరితగతిన పూర్తిచేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయాలని కోరారు.
కార్యక్రమంలో బార్ ఉపాఢ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పాల్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు అపూర్వ, గంగోనే కవిత, మానిక్ రాజు, కృష్ణనంద్, ఆశ నారాయణ, పడిగెల వెంకటేశ్వర్ మాజీ పిపి మధుసుధన్ రావు, హరిప్రసాద్, వి.భాస్కర్, శ్యామ్ బాబు, అయ్యూబ్, సదుల్ల, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.