కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం రాత్రి బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతి ఫూలే రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆయన పరిశీలించారు.
వసతి గృహంలో నివసించే విద్యార్థినులకు వసతి సౌకర్యాలు కల్పించాలని, శుచి కరమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. స్టోర్ రూంలోని బియ్యం, ఇతర సరుకులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విమల, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.