జగిత్యాల, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడిరగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది.
డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యదరవేణి రవీందర్ మార్చి 27న దుబాయిలో మరణించగా అతని భార్య మౌనికకు, నాచుపల్లి గ్రామానికి చెందిన కంకణాల శ్రీకాంత్ సెప్టెంబర్ 9న ఖతార్‌లో మరణించగా అతని భార్య దివ్యకు ఎమ్మెల్యే రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రొసీడిరగులు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో గల్ఫ్ గోస విన్నాడు. అధికారంలోకి రాగానే ‘గల్ఫ్ గ్యారంటీ’ అమలు చేశాడు. కేసీఆర్ లాగా కల్లబొల్లి.. ఖల్లివెల్లి కబుర్లతో మోసం చేయడం కాదు… ‘గల్ఫ్ భరోసా’ అంటే ఏమిటో రేవంత్ రెడ్డి అమలు చేసి చూపిస్తున్నాడని అన్నారు.
గల్ఫ్ కార్మికులు, వారి పక్షాన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రభుత్వం… హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘‘ప్రవాసీ ప్రజావాణి’’ కౌంటర్‌ను నిర్వహిస్తున్నది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు, ముఖ్యంగా గల్ఫ్ బాధితుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ప్రాధాన్యతతో ప్రవేశాలు కల్పించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే సత్యం అన్నారు.