కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, అదే సమయంలో ట్యాబ్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.
రైతులు మాట్లాడుతూ, రబీ సీజన్ లో జొన్న పంట సాగుచేస్తామని, నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు గ్రామానికి దగ్గరగా ఉన్నప్పటికీ సాగు, తాగు నీటికి ఉపయోగంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ, బోరు బావుల్లోని నీరు తాగుతున్నమని తెలిపారు.
అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేల్గనూర్ గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్ , జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, పాక్స్ చైర్మన్ నరసింహా రెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.