కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామపంచాయతీ, మండల, మున్సిపాలిటీ మరియు జిల్లా స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్ -2024 నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సి.ఏం.కప్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు , 2028 లో జరగనున్న ఒలింపిక్ క్రీడలలో మరిన్ని పతకాలు సాధించేందుకు వారిని గుర్తించి ప్రోత్సహించడానికి పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ నేతృత్వంలో చైర్మన్గా కలెక్టర్, వైస్ చైర్మన్గా ఎస్పీ, కో చైర్మన్గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవోతో పాటు డీఈవో, డీపీవో, జీఎం పరిశ్రమలు, జిల్లా యువజన, క్రీడల సంక్షేమ అధికారి, ఒలింపిక్ సంఘం, పాఠశాల క్రీడల ఫెడరేషన్, ఇతర క్రీడా సంఘం అధ్యక్ష / కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు.
గ్రామపంచాయతీ స్థాయి డిసెంబరు 7 నుండి 8 వరకు గ్రామపంచాయతీ స్థాయి ఆటలు, డిసెంబర్ 10 నుండి 12 వరకు మండల, మునిసిపల్ స్థాయి, 2024 డిసెంబర్ 16 నుండి 21 వరకు జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయికి కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ జట్టును ఎంపిక చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఎంపికలు 27 డిసెంబర్ 2024 నుండి 2 జనవరి 2025 వరకు జరుగుతాయనీ తెలిపారు.
జిల్లాలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాలలో బాలురు, బాలికలకు క్రీడలు నిర్వహించుటకు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, వివిధ శాఖల అధికారులు, వివిధ ఫెడరేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.