కామారెడ్డి, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్‌లో 68వ ఎస్.జి.ఎఫ్. రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని అన్నారు. యోగా వలన శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందుతారని అన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో పాల్గొంటున్న బాల బాలికలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించిందనీ, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా విద్య శాఖాధికారి, ఎస్. జి.ఎఫ్. అధ్యక్షులు రాజు మాట్లాడుతూ,ఈ యోగా పోటీల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో నుండి 140 మంది బాల బాలికలు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు మాట్లాడారు.
కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పరిశీలకులు సతీష్, పుష్పలీల, వివిధ సంఘాల నాయకులు, ఎస్. జి.ఎఫ్. కార్యవర్గ సభ్యులు, పి.ఈ.టీ.లు, కోచ్ మేనేజర్లు, పోటీల్లో పాల్గొనే బాల బాలికలు, తదితరులు పాల్గొన్నారు.