కామారెడ్డి, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ కిట్టు ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు ఆర్థిక సాయం అందజేస్తుందని చెప్పారు. పేదల కడుపు నింపే యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నూతన కార్డుదారులకు ఆగస్టు నెల నుంచి రేషన్ పంపిణీ చేస్తారని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్ ఇస్తుందని తెలిపారు. పేదింటి మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. పార్లమెంట్ సభ్యులు బిబి. పాటిల్ మాట్లాడుతూ, నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఆరోగ్య లక్ష్మి పథకంను అర్హతగల లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, మునిసిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.