నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్ రెడ్డి, కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులతో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. 22500 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ తొలివిడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిరచారు.
నిరుపేద మహిళలు, వితంతువులు, దివ్యంగులు, వ్యవసాయ కూలీలు, ట్రాన్స్ జెండర్లకు, గిరిజన, దళిత కుటుంబాల వారికి ఇళ్ల మంజూరీలో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సర్వే యాప్ ద్వారా ఎంపిక చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులలో అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారని తెలిపారు.
కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేలా, ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులను లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు విడతలుగా జమ చేస్తుందని అన్నారు. పేద కుటుంబాల వారికి సైతం సామాజిక గౌరవం కల్పిస్తూ వారి సొంతింటి కలను సాకారం చేయాలనే ఉదాత్తమమైన ఆశయంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్ధవంతంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.