జుక్కల్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు.
కోటలోని ప్రాముఖ్యత కలిగిన ఆనవాళ్లపై మంత్రి ఆరా తీశారు. కోటను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారని, సెలవు దినాల్లో పర్యాటలకు సంఖ్య రెట్టింపుగా ఉంటుందని, మూడు రాష్ట్రాల ( కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ) సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు మంత్రిని కోరారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ఈ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.