కామారెడ్డి, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ, పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు.
ప్రతినెల లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ సిల్క్ బోర్డు సాంకేతిక అధికారి రాఘవేంద్రరావు మాట్లాడుతూ మల్బరీ సాగులో వంగడాల ప్రాముఖ్యతను తెలిపారు. నాణ్యమైన మల్బరీ ఆకు తయారు చేసే విధానాన్ని వివరించారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి మాట్లాడారు.
రైతులు పంటల మార్పిడి పద్ధతిని అవలంబించాలని తెలిపారు. మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక సహాయకులతో గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీని వినియోగించుకోవాలని కోరారు. మల్బరీ సాగులో అధిక దిగుబల్లి సాధించిన రైతు హర్షాద్‌ను ఈ సందర్భంగా శాస్త్రవేత్త సన్మానించారు.
సమావేశంలో జిల్లా సెరికల్చర్ అధికారి ఐలయ్య, రాజయ్య, సాంకేతిక సహాయకుడు నాగేందర్ రావు, ఉమ్మడి జిల్లా రైతులు బుచ్చిరెడ్డి, హర్షద్, ఏఈఓ లిఖిల్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.